బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు

  • రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ
  • కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ భూతం మరోసారి కలకలం రేపింది. సినిమా అవకాశాల పేరుతో నమ్మించి, రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ అనే వ్యక్తి బాధితురాలిని సంప్రదించాడు. ఒప్పందం ప్రకారం 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఆమెకు ఇవ్వాల్సిన రూ.90,000 పారితోషికంతో పాటు ప్రయాణ ఖర్చులు రూ.38,000 చెల్లించకుండా నిందితుడు కాలయాపన చేశాడు.

ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో డబ్బులు ఇస్తానని నమ్మించి బంజారాహిల్స్‌కు పిలిపించాడు. అక్కడికి వెళ్లిన నటిని బలవంతంగా కారులోకి ఎక్కించి, డోర్లు లాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతేనే ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని, లేదంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలి తల్లి ప్రశ్నించగా, ఆమెను కూడా ఫోన్‌లో దుర్భాషలాడినట్లు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 

Casting Director Prasad
Tollywood Casting Couch
Banjara Hills Police
Sexual Harassment Case
Telugu Actress
Akashamlo Oka Tara

More Telugu News